Jarawa members: 19 మంది ఆదివాసీ జరావా తెగ ప్రజలకు ఓటరు కార్డులు జారీ..! 11 h ago
అండమాన్ ఆదిమ జనజాతి వికాస్ సమితి (ఏఏజేవీఎస్) సహకారంతో ఎన్నికల అధికారులు స్వయంగా అండమాన్ నికోబార్ దీవులలోని దక్షిణ అండమాన్ జిల్లాలోని జిర్కటాంగ్ లో జరావా కమ్యూనిటీకి చెందిన 19 మంది సభ్యులను "స్పెషల్ సమ్మరీ ప్రొవిజన్-2025" ప్రకారం భారత ఓటర్ల జాబితాలో చేర్చి, వారికి ఐడీ కార్డులను సీనియర్ ఎన్నికల అధికారి అందించారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ లోని ఓటర్ల విద్య, ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా జరావా తెగ ప్రజలకు ఓటర్ల జాబితాలో చోటు కల్పించారు.
జరావా తెగ గురించి..
ప్రత్యేక సంస్కృతి, వైవిధ్యమైన జీవన విధానం కలిగిన ఈ జరావా తెగ ప్రజలు అటవీ వనరులపై ఆధారపడి ఇప్పటికీ ఆదిమ జీవన విధానాన్ని సాగిస్తున్నారు. వీళ్ళు ప్రధానంగా మధ్య మరియు దక్షిణ అండమాన్ దీవుల పశ్చిమ ప్రాంతాలలో నివసిస్తారు. ఎన్నో ఏళ్లుగా బయటి ప్రపంచానికి దూరంగా ఉన్న వీళ్లు 1997లో వైద్య సహాయం నిమిత్తం పాలన యంత్రాంగంతో స్నేహపూర్వక సంబంధాన్ని ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం, జరావాల జనాభా దాదాపు 250 నుంచి 400 వరకు ఉంది. వీళ్లు (PVTG-పర్టీక్యులర్లీ వల్నర్బుల్ ట్రైబల్ గ్రూప్స్)గా వర్గీకరించబడ్డారు. అండమాన్ మరియు నికోబార్ దీవులలో మొత్తం 5 ఆదిమ తెగలు(PVTGలు) ఉన్నాయి. అవి: గ్రేట్ అండమానీస్, ఒంగెస్, జరావాస్, సెంటినాలీస్, నికోబారీస్, షాంపెన్స్.